అటవీ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనాలపై తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ బోర్డు(Wildlife Board) 8వ సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్బంగా వన్య ప్రాణుల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలేంటి? ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న అంశాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులకు మంత్రి సురేఖ కీలక ఆదేశాలు జారీ చేశారు. వన్య ప్రాణుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అందుకోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. వన్య ప్రాణులకు ఇబ్బంది కలిగించే చర్యలను ఎవరూ పాల్పడకుండా చూసుకోవాలని చెప్పారు.
ఈ క్రమంలోనే అటవీ ప్రాంత రోడ్లపై చీకటి పడిన తర్వాత హెవీ వెహికల్స్ ప్రయాణానికి అనుమతించవద్దని ఆదేశించారు. ఈ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పారు. నియమ నిబంధనలను అధ్యయనం చేసి, వాహనాల రాకపోకల సమయపాలనపై అవసరమైన నిబంధనల సవరణ చేయాలని సలహా ఇచ్చారు. మంత్రి(Konda Surekha) ఆదేశాలను పరిశీలిస్తామని, వన్య ప్రాణుల రక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.