సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao).. సెటైర్లు వేశారు. అబద్ధాలు చెప్పడం సీఎం రేవంత్‌కు బాగా అలవాటైపోయిందని, ప్రతిరోజూ అన్నం తిన్నట్లు అబద్దాలు కూడా తప్పకుండా చెప్పాలి అన్న నియమం పాటిస్తున్నారంటూ విమర్శించారు. రేవంత్(Revanth Reddy) నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్‌లోని ఎనుమూముల వ్యవసాయ మార్కెట్‌ను(Enumamula Market) ఎర్రబెల్లి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై ఆయన విమర్శల వర్షం కురిపించారు.
అబద్ధాలు చెప్పి కేంద్రంలో బీజేపీ(BJP) అధికారంలోకి వచ్చింది. బోగస్ మాటలు మాట్లాడి రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చింది. ‘‘రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, అబద్ధాలు మాట్లాడడం మానుకో. రైతు భరోసా(Rythu Bharosa) ఇవ్వలేదు, రుణమాఫీ(Loan Waiver) పూర్తి చేయలేదు. తెలంగాణలో రైతులు ఆవేదన చెందుతున్నారు. యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లలో పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. అబద్ధాలతో ఇప్పటికి తప్పించుకుంటావేమో కానీ ప్రజలు నువ్వు చేస్తున్న అన్యాయాన్ని ఎన్నటికీ మర్చిపోరు. తగిన గుణపాఠం నేర్పించి తీరుతారు’’ అని హెచ్చరించారు. అంతేకాకుండా రైతులను అన్ని విధాలా ఆదుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది అని ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) స్పష్టం చేశారు.