తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి “లైఫ్ సైన్సెస్ పాలసీ”ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రకటించారు. తెలంగాణలో దేశ విదేశాల పెట్టుబడులకు సులభతరమైన పారిశ్రామిక విధానం, అవసరమైన మౌలిక సదుపాయలు కల్పన, అందుకు అనుగుణమైన పాలసీ, తగిన సహకారాన్ని అందించడంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతుందని చెప్పారు. ఫార్మా, లైఫ్ సైన్స్, హెల్త్ టెక్ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడతామని అన్నారు.
ఆ లక్ష్య సాధనకోసం హైదరాబాద్ వేదికగా బయో ఆసియా-2025 సదస్సు(Bio Asia Summit) జరుగుతోందని చెప్పారు. బయో ఆసియా.. హైదరాబాద్‌ను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా తీర్చిదిద్దుతుందన్నారు. ఆరోగ్య, వైద్య రంగం భవిష్యత్తును నిర్దేశించడంతో పాటు ఈ రంగంలోని ప్రపంచానికే హైదరాబాద్‌ను మార్గదర్శంగా నిలపడం ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు.
“బయో ఆసియా సదస్సు హైదరాబాద్ ను ప్రపంచ లైఫ్‌సైన్సెస్ రాజధానిగా మార్చింది. ఫార్మా, ఐటీ, డిజిటల్ హెల్త్ రంగాల్లో గడిచిన 25 ఏళ్లగా హైదరాబాద్ ను ఒక పవర్ హౌజ్‌గా నిలబెట్టింది. ప్రపంచంలో పేరొందిన ఫార్మా, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీలు ఎన్నో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. బయో సైన్సెస్‌లో పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న దార్శకనితతో ప్రభుత్వం ముందునుంచి పనిచేస్తోంది. జినోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నాం.
హెల్త్‌కేర్ రంగం భవిష్యత్తును నిర్ధేశించడంతో పాటు ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా బయో ఆసియా దేశవిదేశాలను ఆకర్షిస్తోంది. తెలంగాణలో ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకోవాలని, ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నాం. నిన్ననే ఆమ్‌జెన్ కంపెనీ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరించింది. ప్రభుత్వ సహకారానికి ఇది నిదర్శనం’’ అని తెలిపారు.
‘‘జర్మనీ కంపెనీ మిల్టెని బయోటెక్ జీనోమ్ వ్యాలీలో తన సెల్, జన్యు చికిత్సను ప్రారంభించింది. ఈ వేదికపై మరో 4 బహుళజాతి కంపెనీలను తెలంగాణ పర్యావరణ వ్యవస్థలోకి స్వాగతిస్తున్నాం. గతేడాది AI హెల్త్‌కేర్ సదస్సును(AI Healthcare Summit) కూడా విజయవంతంగా నిర్వహించాం. దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉద్యోగాల కల్పన ఉంది.
ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణ రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. విభిన్న రంగాలలో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయి. అలాగే, గతేడాది లైఫ్ సైన్సెస్ రంగంలో రూ. 40,000 కోట్లకు పైగా పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించాం. దాదాపు 150 పైగా ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులు విస్తరించాయి’’ అని ఆయన(Revanth Reddy) చెప్పారు.
‘‘ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతంలో మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా, ఫార్మా క్లస్టర్స్ అభివృద్ధి చేస్తున్నాం. తద్వారా 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రీన్ ఫార్మా సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి. వచ్చే పదేళ్లలో తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే కాకుండా చైనా ప్లస్ వన్ ఆలోచనలకు సరైన ప్రత్యామ్నాయ కేంద్రంగా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం. నెట్ జీరో సిటీ కింద అనేక లక్ష్యాలను నిర్ధేశించాం’’ అని వెల్లడించారు.