తెలంగాణను అభివృద్ధి హబ్‌గా తీర్చి దిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ కు హబ్ గా మారుస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్(HCLTech) కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తానని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ ఆపడం ఎవరి తరం కాదని ధీమా వ్యక్తం చేశారు.
‘‘ప్రతిరోజూ మేం బహుళజాతి సంస్థలతో కొత్త అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడమో.. పెద్ద సంస్థలు తెలంగాణకు రావడమో.. గత సంవత్సరం సంతకం చేసిన ఎంఒయుల కొత్త సౌకర్యాలను ప్రారంభించడమో జరుగుతోంది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణకు దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని గర్వంగా చెబుతున్నా. ఉద్యోగ కల్పనలో నెంబర్ వన్ గా నిలిచాం. మన దగ్గర అత్యధిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్నాయి.
తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల జీడీపీ రాష్ట్రంగా మారుస్తానని నేను ముందు చెప్పినప్పుడు… అది సాధ్యం కాదని కొందరు అన్నారు. రెండుసార్లు దావోస్ పర్యటనల్లో రూ.41,000 కోట్లు, రూ.1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేసుకున్న తరువాత ఇప్పుడు అది సాధ్యమని నమ్ముతున్నారు’’ అని Revanth Reddy తెలిపారు.
‘‘తెలంగాణ రైజింగ్(Rising Telangana) ను ఎవరూ ఆపలేరు. మా పోటీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు లేదా చెన్నైతో కాదని నేను చెప్పినప్పుడు… కొంతమంది అది పెద్ద కలనే అవుతుందన్నారు. మనం ఈవీ అడాప్షన్ లో హైదరాబాద్ ను నంబర్ వన్ గా చేశాక… రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ కు హబ్ గా మారుస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ రైజింగ్(Rising Hyderabad) ఆగదు అని ప్రజలు అంటున్నారు. నేను మొదట తెలంగాణ రైజింగ్ అని చెప్పినప్పుడు కొందరికి ఖచ్చితంగా తెలియదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది. నేను మొదట హైదరాబాద్ రైజింగ్ అని చెప్పినప్పుడు కొందరికి అనుమానం వచ్చింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది’’ అని అన్నారు.
‘‘ప్రపంచంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో ఒకటైన ఆమ్జెన్ ను కొద్దిరోజుల క్రితం ప్రారంభించుకున్నాం. మేం ప్రపంచంలోని అత్యుత్తమ సమావేశాలలో ఒకటైన బయో ఏషియాను నిర్వహించాం.. ఇవాళ హెచ్ సీ ఎల్ లో ఉన్నాం. గ్లోబల్ కంపెనీగా హెచ్ సీ ఎల్ టెక్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది. ఇది 60 దేశాలలో ఆపరేట్ చేస్తోంది మరియు 2.2 లక్షల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. డిజిటల్, ఇంజినీరింగ్, క్లౌడ్, ఏఐ రంగాల్లో వరల్డ్ క్లాస్ ఆఫరింగ్స్ క్రియేట్ చేస్తున్నారు. 2007లో హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అంచెలంచెలుగా HCL పెద్ద స్థాయికి ఎదిగింది. ఇవాళ 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 5 వేల మందితో కేఆర్ సీలో ప్రపంచస్థాయి సదుపాయంతో హెచ్ సీఎల్ టెక్ హైదరాబాద్ లో గొప్ప పనులు చేస్తుంది’’ అని వెల్లడించారు.