అగ్రిగోల్డ్ భూముల కబ్జా కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) ఇంట తనిఖీలు చేస్తున్నారు. 15 మంది అధికారులతో కూడిన బృందం తెల్లవారుజాము 5 గంటల నుంచే ఈ సోదాలు చేపట్టారు. విజయవాడ అంబాపురం గ్రామంలోని అగ్రిగోల్డ్ డైరెక్టర్ల పేరిట ఉన్న భూములను నకిలీ పత్రాలతో కొందరు కబ్జా చేశారంటూ అగ్రీగోల్డ్ సంస్థ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ.. ప్రాథమిక ఆధారాల ప్రకారం మాజీ మంత్రి జోగిరమేష్, ఆయన కుమారుడు సహా 9మందిపై కేసు నమోదు చేసింది.
వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండటంతో ఏసీబీ చర్యలు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తెల్లవారుజాము నుంచే సోదాలు చేపట్టింది. పోలీసుల సమక్షంలో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నారు. అగ్రీగోల్డ్ భూముల కబ్జాకు సంబంధించిన ఆధారాల కోసం జోగి రమేష్(Jogi Ramesh) ఇంట్లోని ఫైళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు అధికారులు.