సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణలో భాగంగా నిందితులను గుర్తించిన పోలీసులు తాజాగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ టెస్టుల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. విజయవాడలో బస్సు యాత్ర సాగుతున్న సమయంలో సింగ్ నగర్‌లోని వివేకానంద స్కూల్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో జగన్ మీద రాయి దాడి చోటు చేసుకుంది. దుర్గారావు అనే వ్యక్తి చెబితేనే సతీష్ రాయితో కొట్టినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఏ1గా సతీష్, ఏ2గా దుర్గారావును చేర్చారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీలో దుర్గారావు యాక్టివ్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దుర్గారావు చెబితేనే సతీష్ సీఎం జగన్‌పై దాడి చేసినట్టు విచారణలో పోలీసులు తేల్చారు. బస్సుకు 20 అడుగుల దూరం నుంచి వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై ఉన్న సతీష్.. సిమెంట్ రాయి ముక్కతో బస్సుపై యాత్ర చేస్తున్న దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాయితో దాడి చేసిన తర్వాత సతీష్, దుర్గారావులు తమ ఇళ్లకు వెళ్లిపోయినట్లు విచారణలో వెల్లడైంది. కాగా ఈనెల 13న విజయవాడలో మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్‌పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే.