తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంపై గురువారం విమానం ఎగరడం కలకలం రేపింది. తిరుమలలోని ఆలయంపై విమానం తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. దీంతో తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా కేంద్రం ఎందుకు ప్రకటించడం లేదు అనే చర్చలు మొదలయ్యాయి.
ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం గర్భగుడి మీదుగా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ప్రయాణించడానికి అనుమతి లేదు. అంతేకాకుండా, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విజిలెన్స్, సెక్యూరిటీ విభాగానికి భద్రతా సమస్యలకు దారితీస్తుంది. అయితే తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని టిటిడి యాజమాన్యం పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇంతవరకు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోలేదు.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారికంగా తిరుమల(Tirumala) గగనతలాన్ని ఫ్లై-జోన్‌గా ప్రకటించలేదు. విమానయాన సంస్థలు, చార్టర్డ్ ఏవియేషన్ కంపెనీలు ఆలయానికి ఉన్న అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని ఆలయం మీదుగా ఎగరకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ, ఆలయ గగనతలంపై హెలికాప్టర్లు, విమానాలు ఎగురుతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నందున ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.