శ్రీవారి ఆస్తులను పప్పుబెల్లాల్లా గత పాలకమండలి అమ్మేసిందంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) మండిపడ్డారు. అసలు శ్రీవారి ఆస్తులను అమ్ముకునే అధికారం గత పాలకమండలికి ఎవరిచ్చారని, అసలు శ్రీవారి ఆస్తులను అమ్మేదిశగా గత పాలకమండలి ఎందుకు అత్యుత్సాహం చూపిందంటూ ఆయన ప్రశ్నించారు. ఈ సందర్బంగానే రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు సంబంధించి ఆస్తులను సమీక్షించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. దేవాలయాల విషయంలో గత ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లిప్తతో వ్యవహరించిందని, భక్తుల మనోభావాలంటే లెక్కలేకుండా ప్రవర్తించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి లడ్డూ వివాదంపై సమీక్షిస్తూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘TTDతో పాటు దేవాదాయశాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల విషయంలో సమీక్ష చాలా అవసరం. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు సూచిస్తున్నాను. అన్ని ఆలయాల ఆదాయం, ఆస్తుల వివరాలను అందుబాటులో ఉంచాలి. అప్పుడే దేవుని ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండటంతో పాటు ఆలయాలు, పాలక మండళ్లు జవాబుదారీతనంతో పనిచేస్తాయి’’ అని పవన్(Pawan Kalyan) తన అభిప్రాయం వ్యక్తం చేశారు.