ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడారు. తన భవిష్యత్తు కార్యాచరణ పై పెదవి విప్పారు. వైఎస్ షర్మిలని కలిసినట్టు చెప్పారు. ఆమె కాంగ్రెస్ లో చేరిన తర్వాత మరోసారి కలుస్తా అని వెల్లడించారు. తాను వైయస్సార్ భక్తుడిని అని, ఆయన కుటుంబ సభ్యులతోనే నడుస్తానని స్పష్టం చేశారు. మంగళగిరి(Mangalagiri)ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని చెప్పిన ఆయన.. ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించలేదని, కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
నా సొంత డబ్బులతో కూడా కొన్ని పనులు చేశానని ఆర్కే చెప్పారు. అభివృద్ధి పనులు చేయకపోతే మళ్లీ ప్రజలను ఓట్లు ఎలా అడగాలి అని ప్రశ్నించారు. అందుకే తాను రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. నైతిక విలువలను పాటిస్తూ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని అన్నారు. ఏ అధికారిక కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని స్పష్టం చేశారు. నేను రాజకీయాల్లోనే ఉంటా.. షర్మిల(YS Sharmila) వెంట నడుస్తానని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి భక్తుడిగా ఆయన కుటుంబ సభ్యుల వెంటే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని ఆర్కే తేల్చి చెప్పారు. షర్మిలను కలిశాను, ఆమె కాంగ్రెస్ లో చేరితే మరోసారి కలుస్తానని ఆళ్ళ రామృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy) తెలిపారు. అయితే, ఆర్కే రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరుతారు అనే సస్పెన్స్ నెలకొంది. ఆయన రాజకీయ ప్రయాణం షర్మిల తోనే అని చెప్పడంతో ఉత్కంఠకు తెరపడింది.