పవన్ కళ్యాణ్ తో భేటీపై అంబటి రాయుడు(Ambati Rayudu) క్లారిటీ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన జనసేన అధినేతని కలవడం చర్చలకు దారితీసింది. అంబటి రాయుడు జనసేనలో చేరబోతున్నారనే గుసగుసలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఊహాగానాలకు చెక్ పెట్టారు రాయుడు. తాను పవన్ కల్యాణ్(Pawan Kalyan) ని ఎందుకు కలిశారో వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
“నేను స్వచ్ఛమైన సంకల్పంతో, మనస్సుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. వైసీపీ అందుకు అనువైన పార్టీ అని నేను నమ్మాను. నేను క్షేత్రస్థాయిలో ఉంటూ అనేక గ్రామాలను సందర్శించి చాలా మంది ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అర్థం చేసుకున్నాను. వ్యక్తిగతంగా వాటి పరిష్కారానికి నా వంతు కృషి చేశాను. అనేక సామాజిక సేవాకార్యక్రమాలు చేశాను. కొన్ని కారణాల వల్ల వైసీపీ(YCP)లో కొనసాగడం వల్ల నా కల నెరవేరడం కష్టం అనిపించింది. నేను ఎవరినీ నిందించట్లేదు. కేవలం నా భావజాలం, వైసీపీ సిద్ధాంతాలు ఏకీభవించలేదు. ఎన్నికల్లో పోటీ చేయడానికి, సీట్లకు ఎలాంటి సంబంధం లేదు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. అయితే ఆ నిర్ణయం తీసుకునే ముందు పవన్ అన్నని కలిసి ఒకసారి ఆయన సిద్ధాంతాలను తెలుసుకోమని.. నా శ్రేయోభిలాషులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు కోరారు. అందుకే నేను పవన్ అన్నను కలిశాను. ఆయనతో జీవితం గురించి, రాజకీయాల గురించి చాలాసేపు చర్చించాను. ఆయన భావజాలం, దృక్పథం నా ఆలోచనలకి దగ్గరగా ఉండడం చాలా సంతోషంగా అనిపించింది. ఆయనని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా క్రికెట్ కమిట్‌మెంట్‌ల కోసం నేను దుబాయ్ వెళ్తున్నాను. నేను ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటాను” అంటూ సుదీర్ఘంగా రాసుకొచ్చారు అంబటి రాయుడు(Ambati Rayudu).