Anantapur murder mystery Chased by police: రోడ్డుకు అడ్డుగా ఉన్నాడనే కారణంతో.. ఓ వ్యక్తిని ఇద్దరు యువకులు చంపేశారు. ఈ దారుణ ఘటన అనంతపురంలో జరిగింది. అక్టోబర్ 28న సీసీ సురేష్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతడికి ఎవరితో వివాదాలు లేకపోవటం, అనుమానాస్పదంగా ఏమీ లేకపోవటంతో.. హత్య ఎవరు చేశారన్నది మిస్టరీగా మారింది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. క్షణికావేశంలో ఇద్దరు యువకులు సురేష్‌ను హత్య (Anantapur murder) చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.
వివరాల్లోకి వెళ్లతే.. సీసీ సురేష్ అనే వ్యక్తి సహచర ఉద్యోగితో కలిసి.. ఓ కాఫీ క్లబ్‌కు వెళ్లారు. అక్కడ కాఫీ తాగిన తరువాత.. సురేష్ రాజీవ్ కాలీనికి వెళ్లే సర్వీసు రోడ్డులో తన ద్విచక్ర వాహనాన్ని ఆపి.. ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో.. సోములదొడ్డి వైపు నుంచి బి సాయికిరణ్, కే రేణుకుమార్ అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. రోడ్డుకు ద్విచక్ర వాహనం అడ్డంగా ఉందని సురేష్‌తో వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. అది కాస్తా పెద్దది కావటంతో.. సురేష్ హెల్మెట్‌తోనే అతని తలపై బలంగా పలుమార్లు దాడి చేశారు. తల వెనుక భాగంలో తీవ్ర గాయం కావటంతో.. సురేష్ అక్కడికక్కడే కుప్పకూలాడు. భయాందోళనకు గురైన నిందితులిద్దరూ.. అక్కడ నుంచి పరారయ్యారు. పలు కోణాల్లో దర్యాప్తు చేసినా.. కేసులో ఎటువంటి పురోగతి లేకపోవటంతో.. ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, విచారణ ప్రారంభించారు. దీంతో నిందితులు పట్టుబడ్డారు. మృతుడికి.. నిందితులకు అసలు ఎటువంటి సంబంధం లేదనీ.. కేవలం క్షణికావేశంలోనే హత్య చేశారని పోలీసులు స్పష్టం చేశారు. సాయి కిరణ్, రేణుకుమార్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.