తిరుమలలో మరో చిరుత బోన్ కు చిక్కింది. 10 రోజుల క్రితమే ట్రాప్ కెమెరా ద్వారా చిరుత సంచారాన్ని అటవీశాఖ గుర్తించారు. నరసింహ స్వామి ఆలయం..7వ మైల్ కి మధ్యలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. 75 రోజుల వ్యవధిలో 5 చిరుతలను అటవీ అధికారులు బంధించారు. తాజాగా పట్టుబడిన చిరుతను జూపార్కులో విడిచిపెట్టారు.
అలిపిరి నడక దారిలో ఈ ఏడాది జూన్ 22, ఈనెల 11వ తేదీ చిన్నారులు కౌశిక్, లక్షితలపై జరిగిన దాడుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన బోనుల్లో ఇప్పటి వరకూ ఐదు చిరుతలు పట్టుబడ్డాయి. అయితే తాజాగా పట్టుబడిన చిరుత సంఖ్య రీత్యా ఎన్నోది అనే ప్రశ్న తలెత్తుతోంది. తొలుత పట్టుబడిన చిరుతను అటవీ అధికారులు అత్యంత సమీపంలోనే విడిచిపెట్టేయగా రెండవసారి, మూడవసారి పట్టుబడ్డ చిరుతలను జూపార్కులో ఉంచారు. గతంలో పట్టుబడిన నాలుగు చిరుతలూ మగవేనని అధికారులు చెబుతున్నారు. మొదటి మూడు పులులూ రెండు నుంచీ మూడేళ్ల లోపు వయసు కలిగి ఉన్నాయని, నాలుగోది మాత్రం ఐదారేళ్ల వయసు కలిగి ఉందని చెబుతున్నారు.
వరుసగా చిరుతల సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత కోసం టీటీడీ అన్ని చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికారులు కాలినడక భక్తులకు కర్రలు పంపిణీ చేస్తున్నారు. అలాగే ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని చెబుతున్నారు. నడక మార్గం పరిసర ప్రాంతాల్లో 400 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని.. వన్యప్రాణులు, కృరమృగాల కదలికలను అనుక్షణం గమనిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
గత రాత్రి తిరుమల గిరుల్లో బోనులో చిక్కిన చిరుత పులి దృశ్యం ? pic.twitter.com/1IIUMHw4xx
— Dr. K. Srinivasa Varma (@DrKSVarma) September 7, 2023