స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(Skill Development Case)లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడాన్ని సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ వాదనలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోకపోవడంపై అభ్యంతరం తెలిపింది. ఈ పిటిషన్ త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కాగా స్కిల్ కేసులో చంద్రబాబు(Chandrababu) పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తీర్పు వెల్లడించే సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీడీపీ ఖాతాలకు నిధులను మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ సమర్పించలేకపోయిందని తేల్చిచెప్పింది. అక్రమ లావాదేవీల్లో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ తేల్చిందని సీఐడీ(CID) వాదిస్తున్నప్పటికీ ఆ వాదనను బలపరిచేందుకు ఎలాంటి ఆధారాలూ లేవంది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు చంద్రబాబుకు రిమాండ్ విధించాలని అభ్యర్థించక ముందే తగిన ఆధారాలను సేకరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది.