40 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీల(Anganwadi Workers)పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే ఎస్మా అస్త్రం ప్రయోగించిన సర్కార్.. తాజాగా విధులకు హాజరుకాని అంగన్వాడీలను తక్షణమే తొలగించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి(Jawahar Reddy) ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో చేరని వారి జాబితాను పంపించాలని.. అటువంటి వారిని వెంటనే టెర్మినేషన్ చేయాలని సూచించారు. ఛలో విజయవాడకు అంగన్‌వాడీలు పిలుపునివ్వడంతో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వం ఆదేశాలపై అంగన్‌వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అటు విజయవాడకు తరలివెళ్తున్న అంగన్‌వాడీలను(Anganwadi workers) పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేషన్లలోనే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. 40రోజులకు పైగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని.. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు.