అంగన్వాడీ వర్కర్ల(Anganwadi Workers)కు ఏపీ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. జనవరి 5వ తేదీలోగా విధుల్లో చేరాలని లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సమ్మెతో గర్భిణులు, శిశువులు పౌష్టికాహారం అందక ఇబ్బంది పడుతున్నారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. విధులకు హాజరుకాని వారి వివరాలు సేకరించాలని అధికారులకు సూచనలు కూడా చేసింది.
కాగా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత 22 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు(Anganwadi Workers) సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వినూత్న రీతుల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే పలు మార్లు ప్రభుత్వంపై చర్చలు జరిపినా విఫలం కావడంతో ధర్నాలు కొనసాగిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన ఆపేది లేదని స్పష్టం చేశారు. తాజాగా ప్రభుత్వం అల్టిమేటం నోటీసులపై అంగన్ వాడీ వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.