నేటితో రాజ్యసభ నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. ఏపీలో రాజ్యసభ(AP Rajya Sabha) ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. మూడు సీట్లకు వైసీపీ నుంచి ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావులు నామినేషన్ వేశారు. రాజ్యసభ ఎన్నికల పోటీ విషయంలో వస్తున్న ఊహాగానాలకు టీడీపీ తెర దించింది. బలం లేకపోవడంతో బరిలో దిగకూడదని నిర్ణయించుకుంది. పార్టీ సీనియర్ల సమావేశంలో స్వయంగా చంద్రబాబే ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇక రేసు నుంచి టీడీపీ తప్పుకోవడంతో మూడు సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్ళనున్నాయి.
AP Rajya Sabha | కాగా, రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే టీడీపీ రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచి వైసీపీకి మరో ఝలక్ ఇస్తుందని అంతా అనుకున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పెద్దల సభ ఎన్నికల దృష్టిలోనే అనర్హత పిటిషన్ల అంశం బయటకి వచ్చిందనే టాక్ నడిచింది. అయితే అనేక తర్జనభర్జనల అనంతరం పోటీలో నిలబడొద్దనే నిర్ణయానికి టీడీపీ వచ్చింది. గతంలో ఏమాత్రం బలం లేకున్నా, ఎవ్వరూ తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వరని తెలిసినా వర్ల రామయ్యను బరిలో దింపింది టీడీపీ. కానీ ఇప్పుడు వైసీపీలో అసంతృప్తుల ఓట్లు తమ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉందని తెలిసినా వెనకడుగు వేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం సరికాదని టీడీపీ అధిష్టానం ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావించినట్టు తెలుస్తోంది.