టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2021 ఫిబ్రవరి 12న తన శాసనసభ సభ్యత్వానికి గంటా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఆయన రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్(Tammineni Sitaram) నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా గంటా ఎన్నికయ్యారు.
త్వరలోనే ఏపీలో ఖాళీ కాబోతున్న మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో రాజీనామాను ఆమోదిస్తే ఈ ఎన్నికల్లో గంటా ఓటు వేయడానికి వీలు ఉండదని.. అందుకే ఎన్నికల సమయంలో రాజీనామాను ఆమోదించారని టీడీపీ(TDP) నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల బలాల ప్రకారం ఈ మూడు స్థానాలు అధికార వైసీపీకే దక్కనున్నాయి. అయితే టికెట్ దక్కని వైసీపీ నేతలు టీడీపీకి మద్దతు ఇస్తే ఓ స్థానం కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేల బలాన్ని తగ్గించడంతో భాగంగానే గంటా(Ganta Srinivasa Rao) రాజీనామాను ఆమోదించారని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.