ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అరెస్ట్ అయ్యారు. మెగా డీఎస్సీ ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ‘ఛలో సెక్రటేరియట్’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా షర్మిల విజయవాడలోని కాంగ్రెస్ ఆఫీస్ నుంచి కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరు. ఈ క్రమంలో కొండవీటి ఎత్తిపోతల వద్దకు రాగానే షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ తోపులాటలో షర్మిల చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా పోలీసులు ఇలా ప్రవర్తించడం దారుణమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని.. విజయమ్మ కూడా బాధపడుతున్నారని తెలిపారు. వైఎస్ఆర్ బిడ్డ పోరాటం నిరుద్యోగుల కోసమేనని తెలిపారు. సచివాలయానికి సీఎం రాడని మంత్రులు, అధికారులు కూడా రారంటూ మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్న నేతలకు పాలన చేతకాదనీ.. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం నోటిఫికేషన్‌లు ఇవ్వడం చేతకాలేదని ఫైర్ అయ్యారు.
కాగా మెగా డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ‘ఛలో సెకట్రేరియట్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. షర్మిలను కూడా పార్టీ ఆఫీస్ నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసుల తీరుతో ఆఫీసులోనే షర్మిల సహా ఇతర నేతలు నిరసనకు దిగారు.