గ్రూప్-2 మెయిన్(Group 2 Mains) పరీక్షల అంశంపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. గ్రూప్ 2 అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ(APPSC) సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాగా, రోస్టర్ తప్పులను సరిదిద్దకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం రోస్టర్ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది. వచ్చే నెల 11వ తేదీన మరోసారి విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఉన్న అంశంపై అఫిడవిట్ వేయడానికి ఇంకా సమయం ఉందని, అప్పటి వరకు గ్రూప్-2 మెయిన్స్(Group 2 Mains) పరీక్షలను నిర్వహించొద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ కి లేఖ రాసింది.
గత కొన్ని రోజులుగా రోస్టర్ విధానంలో మార్పులు చేయాలంటూ గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై వారు హైకోర్టును కూడా ఆశ్రయించారు. 23 ఫిబ్రవరిన జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తూ ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థులు న్యాయస్థానాన్ని కోరారు. అయితే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష అనంతరం అభ్యర్థుల నుంచి మరోమారు పోస్టుల ప్రాధాన్యతలు తీసుకుంటారని ఏపీపీఎస్సీ తెలిపింది.
ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా రూపొందించే ముందు దీనికి సంబంధించిన ప్రక్రియ చేపడతామని ఏపీపీఎస్సీ తెలిపింది. పోస్ట్‌లు, జోన్‌లపై అభ్యర్థులు తమ ప్రాధాన్యతలు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే పరీక్షను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.