కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపు పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా విశాఖ రైల్వే జోన్(Visakha Railway Zone) ఆలస్యంపై స్పందించారు. రైల్వేజోన్ ఆలస్యానికి ఏపీ ప్రభుత్వమే కారణమన్నారు. జోన్ ఏర్పాటుకు కావలసిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందించలేదని చెప్పారు. జోన్ ఏర్పాటుకు 53 ఎకరాలు కావాలి. కానీ అవసరమైన భూమిని ఏపీ సర్కార్ అప్పగించలేదు. ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వకుంటే మేమేం చేస్తామని ప్రశ్నించారు. ప్రాజెక్టు సమగ్ర నివేదిక వచ్చింది. అయినప్పటికీ భూమి లేకపోవడం వలన పనులు ప్రారంభించలేదని స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల బడ్జెట్ కేటయింపులపై ఆయన మాట్లాడుతూ… దేశంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రధాని మోడీ బడ్జెట్ కేటాయింపులు చేశారన్నారు. 2009-14లో ఉమ్మడి ఏపీకి రూ.886 కోట్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏపీకి రూ.9,138 కోట్లు కేటాయించాం. ఈ ఏడాది తెలంగాణకు రూ. 5,071 కోట్ల కేటాయించాం. ఏపీలో 97 శాతం ట్రాక్స్ కి విద్యుదీకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. 72 స్టేషన్లు అమృత్ స్టేషన్ లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణలో 100 శాతం ఎలక్ట్రిక్ ట్రాక్స్, 40 అమృత్ స్టేషన్లు నిర్మిస్తున్నామని మంత్రి(Ashwini Vaishnaw) తెలిపారు.