మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నానంటూ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలు చూస్తే విరక్తి పుట్టిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని మా అబ్బాయి కోరుకున్నాడని.. తెలంగాణ అంతా తిరిగి బీఆర్ఎస్(BRS) గెలుస్తుందని చెప్పాడన్నారు. అయితే తాను మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు బెట్టింగ్ కాశానని.. కానీ తన కుమారుడు ఫీలవుతాడని ఆ బెట్టింగ్ వెనక్కి తీసుకున్నానని వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే ఏపీలోనూ జగన్(YS Jagan) గెలుస్తారని తన కుమారుడు అనుకున్నాడని చెప్పుకొచ్చారు. జగన్ అంటే తమకు అభిమానమని.. అయితే జగన్‌కూ తమపై అభిమానం ఉండాలి కదా అంటూ మాట్లాడారు.
అలాగే ఒంగోలు కాకుండా మరో చోట నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పాతిక వేల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని సీఎం జగన్‌కి చెప్పానని పేర్కొన్నారు. ప్రస్తుతం కుల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయని మీరంతా అండగా ఉంటేనే పోటీ చేస్తా లేదంటే చేయనని చెప్పేశారు. దీంతో ప్రస్తుతం బాలినేని(Balineni Srinivas Reddy) వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.