ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి వీడ్కోలు పలికి జనసేనలో చేరనున్నారని కొంత కాలంగా జోరుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా గురువారం తన పార్టీ మార్పు అంశంపై బాలినేని క్లారిటీ ఇచ్చారు. వైసీపీలో తాను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్‌తో ఈరోజు జరిగిన భేటీలో జనసేనలో చేరాలన్న తన ఆలోచనను బాలినేని వెల్లడించారని, వెంటనే పవన్ కూడా అతనిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగానే అడిగిన వెంటనే ఆహ్వానించిన పవన్ కల్యాణ్‌కు బాలినేని కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్, బాలినేని భేటీ అయ్యారు. ఇందులో పలు కీలక అంశాలపై వారు చర్చించారు. ఇందులో భాగంగానే పార్టీ మారలన్న తన ఆలోచనను, జనసేన(Janasena)లో చేరాలన్న ఆలోచనను బాలినేని వెల్లడించగా అందుకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రానున్న కాలంలో తాను పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకే పని చేస్తానని ఈ సందర్భంగా బాలినేని స్పష్టం చేశారు.
‘‘పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆదేశాల మేరకు నడుచుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా. నేను జగన్‌ను బ్లాక్‌మెయిల్ చేశానని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ప్రచారం చేస్తున్నాయి. అవన్నీ అవాస్తవాలు. గతంలో నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీని వీడలేదు. జగన్‌ను నమ్మి ఆస్తులు కూడా పోగొట్టుకున్నాను. పార్టీ సమావేశాల్లో ఎప్పుడూ, ఎక్కడా కూడా నా గురించి ప్రస్తావించలేదు. నాకు పవన్‌కు మధ్య పరిచయం లేదు. కానీ పవన్.. నా గురించి మంచిగానే మాట్లాడారు. నేను పదవులకు పెద్దపీట వేసే వ్యక్తిని కాదు. గౌరవానికే నా ప్రాధాన్యత ఉంటుంది. స్వచ్ఛందంగానే నేను జనసేనలో చేరుతున్నాను. పదవులపై నాకు ఆశలేదు. గౌరవం కావాలి అంతే’’ అని చెప్పారు బాలినేని(Balineni Srinivasa Reddy).