తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్(TTD Chairman) గా తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన రెండేళ్ల పాటు సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ గా నియమించిన సీఎం జగన్ కు భూమన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి 2019 లో బాధ్యతలు చేపట్టారు. నాలుగేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం మరో వారం రోజుల్లో ముగియనుంది.
దీంతో చైర్మన్ రేసులో భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బీసీ నేతలైన జంగా కృష్ణమూర్తి, కొలుసు పార్థసారథి పేర్లు వినిపించాయి. అయితే సుదీర్ఘ సమాలోచనలు జరిపిన ప్రభుత్వం.. చివరకు భూమనను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం చైర్మన్ తో పాటు టీటీడీలో 35 మంది పాలక సభ్యులు ఉన్నారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భూమన కరుణాకర్ రెడ్డి గత నెల సమావేశమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. తిరుపతి టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని అభ్యర్థించారు. గతంలో టీటీడీ చైర్మన్(TTD Chairman) గా పని చేసిన భూమన.. ఈసారి ఆ పదవి తనకు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ ఆయనను చైర్మన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 1960 లో తిరుపతిలోని పద్మావతిపురంలో భూమన జన్మించారు. 1980 లో ఎస్వీ యూనివర్సిటీలో బీఏ డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే పీజీ సైతం చేశారు. ఆ తర్వాత వ్యాపారాల్లో రాణించారు.
రాజకీయాలపై మక్కువతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరి.. 2004 నుంచి 2006 వరకు తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ గా సేవలందించారు. వైఎస్ఆర్ హయాంలో 2006 నుంచి 2008 వరకు టీటీడీ ఛైర్మన్ గా పని చేశారు. 2009 లో తిరుపతి నుంచి పోటీ చేసి మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2012 లో ఏపీ కాంగ్రెస్ కు జనరల్ సెక్రటరీగా సేవలందించారు. ఆ తర్వాత వైసీపీలో చేరి కీలక నేతగా మారారు. 2019 ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.