ఇవాళ విడుదలైన ఏపీ పదో తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) కీలక సూచనలు చేశారు. ఫెయిలైన విద్యార్థులకు తల్లిదండ్రులు భరోసాగా ఉండాలని సూచించారు. ఒక ఏడాది పోయినంత మాత్రాన ఏం కాదని.. ఆత్మహత్యల(Suicides)కు పాల్పడవద్దని రిక్వెస్ట్ చేశారు. మీకు ఎంతో మంచి భవిష్యత్ ఉందని.. జూన్ 2నుంచి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అవ్వాలని తెలిపారు. ఈనెల 17వరకు దరఖాస్తు చేసుకోవాలని, ఆలస్యమైతే రూ.50 రుసుంతో మే22 వరకు అవకాశం ఉందని చెప్పారు. అలాగే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈనెల 13వరకు దరఖాస్తు చేసుకోవచ్చని బొత్స వెల్లడించారు.
అంతకుముందు ఇవాళ ఉదయం 11గంటలకు టెన్త్ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బొత్స ప్రకటించారు. ఫలితాల్లో బాలికలు 75.38శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు. బాలురు 69.27శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా ఉండగా, చివరి స్థానంలో నంద్యాల జిల్లా నిలిచింది. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం 5శాతం ఉత్తీర్ణత పెరిగింది. 933 పాఠశాలల్లో 100శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 38 పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు.