వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ తో టీడీపీ కీలక నేత బీటెక్ రవి(Btech Ravi) భేటీ అవడం రాజకీయ చర్చకు దారి తీసింది. షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ లో చేరి కడప ఎంపీగా పోటీ చేయనున్నారు అని వార్తలు వస్తున్నాయి. మరోవైపు సీఎం జగన్ పై బీటెక్ రవి పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో వీరి కలయిక రాజకీయ దుమారం రేపింది. పరస్పర సహకారం కోసం మంతనాలు జరిపినట్లు టాక్ నడుస్తోంది. కాగా, ఈ వ్యవహారంపై బీటెక్ రవి స్పందించారు. ఓ టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న ఆయన.. అనిల్ తో జరిగిన సంభాషణ గురించి పెదవి విప్పారు. జగన్(YS Jagan) వల్ల పడిన ఇబ్బందుల గురించిన విషయాలు బ్రదర్ అనిల్ తనతో పంచుకున్నట్టు కూడా చెప్పారు.
బీటెక్ రవి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే…
జమ్మలమడుగు(Jammalamadugu) నియోజకవర్గంలో కొండాపురం మండలం నుండి టీడీపీలోకి జాయినింగ్స్ ఉన్నాయి. వీటిపై మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu)తో మాట్లాడి, జాయినింగ్ డేట్స్ కన్ఫర్మ్ చేసుకోవడానికి విజయవాడ వెళ్లేందుకు కడప ఎయిర్ పోర్టుకి వెళ్ళాము. అక్కడ అనుకోకుండా వీఐపీ లాంజ్ లో ఉన్న బ్రదర్ అనిల్(Brother Anil) ని కలిశాము. ఆయనని మర్యాదపూర్వకంగా పలకరించి మాట్లాడటం జరిగింది. రాజకీయాలు, ఇతర అంశాలపై క్యాజువల్ గా చర్చించాము. ఈ క్రమంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరికపై డిస్కషన్ వచ్చింది. PCC ఇస్తున్నారా అని అడిగితే.. ఏ పదవి ఇస్తారు అనేది హై కమాండ్ డెసిషన్ అని అంటూ.. ఆంధ్రా PCC తీసుకుంటే రాష్ట్రంలో ముఖ్యంగా కడపలో ఎలా ఉంటుంది అని బ్రదర్ అనిల్ ప్రశ్నించారు. దానిపై మాకు ఉన్న జనరల్ సమాచారం ప్రకారం కాసేపు మాట్లాడుకున్నాము. జగన్ డే వన్ నుండి మాకు ఏ ఆప్షన్ లేకుండా చేశారని, ఆంధ్రా రాజకీయాల్లోకి రాక తప్పడంలేదని బ్రదర్ అనిల్ చెప్పారు. అలాగే 175 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి మాకు క్యాండెట్లు రెడీగా ఉన్నారని అనిల్ స్పష్టంగా చెప్పినట్టు బీటెక్ రవి వెల్లడించారు.
పరస్పర సహకారం కోసం చర్చలు జరిగాయని వస్తున్న రూమర్స్ పై స్పందిస్తూ.. పులివెందుల(Pulivendula)లో కాంగ్రెస్ తో కలిసి పని చేసే ఆలోచన లేదని అలాంటి చర్చలేవి తమ మధ్య జరగలేదని బీటెక్ రవి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ తో కలిసి పని చేసే ఆలోచన టీడీపీ నాయకుల్లో కానీ, అధిష్టానంలో కానీ లేదని బీటెక్ రవి కుండబద్దలు కొట్టారు. బ్రదర్ అనిల్ తో భేటీ కాకతాళీయంగా జరిగిందని, ఆయన పులివెందుల అల్లుడు కాబట్టి మర్యాదపూర్వకంగా మాట్లాడమని, ఇందులో రాజకీయ కోణం లేదని టీడీపీ నేత రవి(Btech Ravi) స్పష్టం చేశారు.