Free Bus Service | బెజవాడలో వరద సహాయక చర్యలను సీఎం చంద్రబాబు మరింత ముమ్మరం చేశారు. ఎక్కడిక్కడ సహాయక చర్యలను అధికారులు పర్యవేక్షించాలని, ఏ ఒక్కరికీ ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. అదే విధంగా పారిశుద్ధ్య పనులను కూడా పర్యవేక్షించాలని, ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ మేరకు సహాయక చర్యలపై విజయవాడ కలెక్టరేట్ వద్ద సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ వరదల్లో 28 మంది మరణించారు. ఇళ్లలో సామాగ్రి నష్టానికి ఏంచేయాలనే దానిపై కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పారు.
‘‘వరద బాధితుల కోసం ఆయా ప్రాంతాల్లో ఉచిత బస్సులు(Free Bus Service) ఏర్పాటు చేశాం. ఏ ఒక్కరికీ ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలి. తెలుగు రాష్ట్రానికి అందిస్తామన్న ఆర్థిక సహాయం గురించి కేంద్రం ఇంకా ప్రాథమిక నివేదిక పంపలేదు. భాదితులకు సాయం అందించడంపై కేంద్రంతో చర్చలు చేస్తున్నాం. వరద నీరు క్రమంగా తగ్గుతోంది. బుడమేరు గండ్లు పూడ్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. వాటిని వీలైనంత త్వరగా పూడ్చడమే మా లక్ష్యం. వాటిని ఇవాళ రాత్రికే పూడ్చాలని సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు.