ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) మరోసారి స్పష్టం చేశారు. అందులో భాగంగానే సూపర్ సిక్స్‌లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలెండర్ పథకాన్ని(Free Gas Cylinder Scheme) అమలు చేయడానికి నిశ్చయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా ప్రతి ఇంటికి ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్ ఉచితంగా ఇస్తామని, ఇందుకు కావాల్సిన ప్రణాళికలు కూడా సిద్ధం చేశామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమలు విషయంలో కూడా ఒక క్లారిటీకి వచ్చేశామని, అతి త్వరలోనే దీనిని అమలు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఎప్పటి నుంచి ఉచిత గ్యాస్ పథకం అమలవుతుందో కూడా ఆయన ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నాు. అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణంపై కూడా వీలైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఇంతకీ ఉచిత గ్యాస్ పథకంపై సీఎం ఏమన్నారంటే..
‘‘దీపావళి పండగ సందర్భంగా ఉచిత గ్యాస్ సిలెండర్ పథకాన్ని(Free Gas Cylinder Scheme) అమలు చేయాలని నిశ్చయించాం. ఇదే విషయాన్ని ఎన్‌డీఏ శాసనసభాపక్ష సమావేశంలో కూడా నిర్ణయించాం. మహాశక్తి పథకం పేరిట దీనిని అమలు చేయాలన్న నిశ్చయానికి వచ్చాం. మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగానే ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్లు ఉచితంగా అందిస్తాం. తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు గ్యాస్ సిలెండర్ ఉచితంగా అందుతుంది’’ అని ఆయన వెల్లడించారు.