ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీ(New Excise Policy) తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎక్సైజ్ శాఖ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెలలోనే నూతన మద్య విధానాన్ని సిద్ధం చేసి.. దానిని అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని నిశ్చయించారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను క్షేత్రస్థాయిలో అధ్యయం చేయడానికి నాలుగు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ బృందాలన్నీ తమ పరిశాలతో కూడిన సమగ్ర నివేదికను ఈ నెల 12న అందిస్తాయని, ఇంతలో నూతన మద్యం పాలసీపై కూడా కన్సల్టెన్సీ ద్వారా నివేదికను ఏర్పాటు చేసి అన్నింటి మంత్రి వర్గంతో కలిసి చర్చిస్తామని ప్రకటించారు.
‘‘ఆదాయం కోణంలో కాకుండా ఎక్కడా అవకతవకలకు అవకాశం లేని విధంగా నూతన మద్యం విధానాన్ని సిద్ధం చేయాలి. దీని కోసం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న అత్యుత్తమ ఆచరణలను అధ్యయనం చేయాలి. లోసుగులు, లోటుపాటులు ఉండని మద్యం విధానాన్ని ప్రవేశపెట్టాలి’’ అని అధికారులను ఆదేశించారు చంద్రబాబు.
New Excise Policy – నాణ్యతలో రాజీ లేదు
‘‘గత ప్రభుత్వం నాణ్యత అన్న అంశాన్నే మరిచి తయారు చేసిన మద్యాన్ని ప్రజలకు అందించి వారి ప్రాణాలకే ముప్పు వచ్చేలా చేసింది. అలాంటి నాణ్యతలేని, కల్తీ మద్యం మళ్ళీ రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదు. మద్యం నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. గత ప్రభుత్వం అడ్డగోలుగా రేట్లు పెంచి పేదలను దోచుకుంది. దీంతో మద్యం కోనలేక అనేక మంది గంజాయి, నాటుసారా, కల్తీ మద్యానికి అలవాటు పడ్డారు. ఆరోగ్యాల్ని నాశనం చేసుకున్నారు. ప్రతిఒక్కరికీ నాణ్యమైన మద్యం అందుబాటు ధరలకే లభించేలా నూతన విధానం ఉండాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.