దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu), ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు(Daggubati Venkateswara Rao) గురువారం ఒకే వేదికను పంచుకున్నారు. చంద్రబాబు నాయుడు గతాన్ని మరచిపోవాలని, ఎలాంటి ద్వేష భావాలు కలిగి ఉండకూడదని వెంకటేశ్వరరావు కోరగా చంద్రబాబు నాయుడు ఆయనని కౌగిలించుకున్నారు. ఈ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది.
నేడు విశాఖపట్నంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర(Prapancha Charitra)’ పుస్తకం విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వెంకటేశ్వరరావు భార్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎంపీ భరత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. “మీ అందరికీ తెలుసు. చంద్రబాబుకి, నాకు మధ్య విభేదాలు ఉన్నాయని. కానీ, అది గతం, అది ముగిసింది. ఆయన చేసిన కృషికి నేను మనస్ఫూర్తిగా ఆయనను అభినందిస్తున్నాను. భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని వెల్లడించారు.
వెంకటేశ్వరరావు తన ప్రసంగం తర్వాత తన సీటుకు తిరిగి వచ్చినప్పుడు, చంద్రబాబునాయుడు ఆయనను కౌగిలించుకోవడానికి లేచి నిలబడ్డాడు. ప్రేక్షకుల చప్పట్ల మధ్య ఎన్టీఆర్ అల్లుళ్ళు ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఇక చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో వెంకటేశ్వరరావు పుస్తకం రాసినందుకు ప్రశంసించారు. ఆయనలో అంత లోతు ఉందని తనకు తెలియదని అన్నారు.
కాగా, 1990ల నాటికే వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. చంద్రబాబు నాయుడు అప్పటి పరిస్థితుల కారణంగా టీడీపీ అధినేత ఎన్టీఆర్ పై తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చిన వెంకటేశ్వరరావు, తరువాత తిరిగి ఎన్టీఆర్ వద్దకు వచ్చారు. అనంతరం ఎన్టీఆర్ మరణించిన తర్వాత, ఆయన రెండవ భార్య లక్ష్మీ పార్వతి నేతృత్వంలో ఎన్టీఆర్ టీడీపీ (ఎల్పీ) పార్టీ ఏర్పాటైంది. అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ పార్టీలోనే చేరారు.
1999లో, ఆయన ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ స్థాపించిన అన్నా టీడీపీలో చేరారు. పార్టీ అవమానకరమైన ఓటమి తర్వాత, ఆయన కొన్ని సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2004లో, ఆయన తన భార్యతో కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ టికెట్ పై రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన పురందేశ్వరి(Purandeswari), యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో బీజేపీలో చేరారు. వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ రాజ్యసభ సభ్యుడైన వెంకటేశ్వరరావు 2004, 2009లో పర్చూరు నుండి కాంగ్రెస్ టిక్కెట్ పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసిన అదే నియోజకవర్గం నుంచి ఆయన ఓటమి పాలైన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
చంద్రబాబు నాయుడు(Chandrababu), వెంకటేశ్వరరావు మధ్య విభేదాలు ఉండటంతో మూడు దశాబ్దాలుగా వారు ఎప్పుడూ కలిసి ఒకే వేదికపై కనిపించలేదు. కొన్నేళ్ళ నుంచి కుటుంబ ఫంక్షన్లలో కలుస్తున్నారు. కానీ పబ్లిక్ గా ఒకే వేదికపై ఇంత సాన్నిహిత్యంగా కనిపించడం ఇదే తొలిసారి. దీంతో ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.