జనసేన ప్రధాన కార్యదర్శి కే నాగబాబు(Nagababu)ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) ప్రకటించారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా గెలవని నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సీఎం చేసిన ప్రకటనపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయనకు ముందుగా మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత ఎమ్మెల్సీ(MLC)గా గెలిపించుకుంటారా? లేకుంటే ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మంత్రి పదవి అందిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం(AP Cabinet)లో ఒక స్థానం ఖాళీ ఉంది.
దాన్ని నాగబాబుతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఇప్పుడు ఈ అంశం రాష్ట్రమంతా తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. అసలు ఎన్నికల్లో నిలువని వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ముందుగా ఆయనను ఎమ్మెల్సీగా నిలబెట్టి గెలిచిన తర్వాతే మంత్రి పదవి ఇవ్వాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
అధికారం చేతిలో ఉంది కదా అని ఎలా బడితే అలా.. ఎవరికి బడితే వారికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి చూడాలి నాగబాబు(Nagababu) విషయంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.