Anna Canteen | మనం ఎంత కష్టపడ్డా అది పట్టెడన్నం కోసమేనని పెద్దలు చెప్తుంటారు. ఆ పట్టెడన్నం తినడానికి ఇబ్బంది పడే వారి కోసం కూటమి ప్రభుత్వం మరోసారి రంగంలోకి దిగింది. పట్టుమని పది రూపాయలు కూడా తీసుకోకుండానే పేదవాడికి భోజనం పెట్టడానికి సిద్ధమైంది. అందులో భాగంగానే వైసీపీ సర్కార్ ఆపేసిన ‘అన్న క్యాంటీన్’ పతకాన్ని పునరుద్దరించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుడివాడలో సీఎం నారా చంద్రబాబు(Chandrababu) నాయుడు ఈ క్యాంటీన్‌ను ప్రారంభించి స్వయంగా తానే నిల్చుని వడ్డించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుడివాడకు టీడీపీ ఎప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు.
‘‘అరకొర సంపాదనతో జీవించే వారికి అన్న క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపతాయి. నూటి కోసం కోటి విద్యలు అంటారు. ఈ జానెడు పొట్ట నింపుకోవడం కోసం ఎంతో కష్టపడతాం. ఎంత కష్టపడినా.. ఎంత సంపాదించినా ఈ పొట్ట నిండా తినాలనే అంతా ఆశిస్తాం. అరకొర జీతాలు, సంపాదనతో జీవించే వారు కూడా కడుపు నింపుకోవడానికి సహాయపడాలనే ప్రభుత్వం అన్న క్యాంటీన్లను(Anna Canteen) తీసుకొచ్చింది. సెప్టెంబర్ నాటికి వీటిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాం. పేదరికం సమాజం కావాలన్నదే నా కల’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.