తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, రానున్న కాలంలో ఆ ఆలయాల్లో ఎక్కడా కూడా అపవిత్రత జరగకుండా చూస్తానని చెప్పారు. ఈ సందర్బంగానే కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం విషయంలో తనపై అనేక ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. తాను అబద్ధాలు చెప్పానని అంటున్న వారు కూడా ఉన్నారని, కానీ దేవుడి విషయంలో తాను అలా చేయనని అన్నారు. తిరుమల ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు పరీక్షలు వెల్లడించాయని మరోసారి పునరుద్ఘాటించారాయన. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
‘‘ఇంట్లో పూజ చేసిన ఎంతో పవిత్ర భావంతోనే చేస్తాం. అటువంటి దేవుని దగ్గర చౌక నెయ్యితో ప్రసాదం(Tirumala Prasadam) తయారు చేశారు. ఆ ప్రసాదాన్ని కోట్ల మంది భక్తులు పవిత్రంగా భావించి సేవించారు. అలా చేయడం తప్పని అన్నా వినలేదు. అందుకే ఎన్‌డీడీబీకి పరీక్ష కోసం పంపాం. అందులో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని తేలిసింది. ఈ విషయం నేను చెప్పకపోయి ఉంటే నిజంగానే వేంకటేశ్వరస్వామికి ద్రోహం చేసిన వాడినయ్యేవాడిని.. అందుకే ఆ రిపోర్ట్‌లో విషయాలను ప్రజల ముందుంచాను. తిరుమలలోనే కాదు రానున్న కాలంలో మరే ఇతర ఆలయంలో కల్తీ అనేది జరగకుండా చూసుకుంటాం. దేవాలయాల పవిత్రత, స్వచ్ఛతను కాపాడాల్సిన బాధ్యత మనది. వాటిని మనం కాపాడుకుంటేనే అవీ మనల్ని కాపాడతాయి’’ అని వ్యాఖ్యానించారాయన(Chandrababu).