ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు(Chandrababu).. వైసీపీ హయాంలో అసలు శాంతి భద్రతలు అనేవే ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే కేసులు పెట్టి కటకటాల వెనక్కి పంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని వివరించారు చంద్రబాబు. అంతేకాకుండా ఆఖరికి ప్రతిపక్ష నేతలపై కూడా ఎన్నో తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. దానిని తాను అక్కడే నిరూపిస్తానని కూడా చెప్పారు.
అందుకోసమే సీఎం చంద్రబాబు.. ఒక్కసారి సభలో తమపై కేసులు ఉన్న నేతలు లేచి నిలబడాలని కోరారు. సీఎం కోరిక మేరకు తమపై తప్పుడు కేసులు బనాయించబడ్డ నేతలంతా లేచి నిలబడ్డారు. దాంతో ‘‘చూశారా అధ్యక్ష.. సభలో మెజారిటీ సభ్యులు తమపై తప్పుడు కేసులు ఉన్న వారే. దానంతటికీ కారణం గత ప్రభుత్వమే’’ అని వివరించారు. చంద్రబాబు(Chandrababu) చేసిన ఈ పనికి సభ అంతా నవ్వులు పూశాయి.