ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే ప్రామాణికంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఓ అడుగు ముందుకేశారు. పులివెందులలో నామినేషన్ వేసే సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాజీ మంత్రి వివేకా హత్య గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. చెల్లెళ్లు షర్మిల, సునీతారెడ్డిలపై పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారు.
‘వైఎస్సార్ వారసులమంటూ పసుపు చీరలు కట్టుకుని కొందరు వస్తున్నారు. వైఎస్సార్ లెగసీని దెబ్బ తీసిన వాళ్లతో చేతులు కలిపిన వీళ్లా వారసులు? వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందెవరు..? వైఎస్‌పై కక్షతో, కుట్రపూర్వకంగా కేసులు పెట్టిందెవరు..? అసలు వైఎస్ పేరును ఛార్జిషీట్‌లో చేర్చిందెవరు..? వైఎస్ పేరు, కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని.. వైసీపీకి పేరు రాకూడదని విగ్రహాలు తొలగిస్తామన్న నేతలు, ఆ పార్టీలతో చేతులు కలిపిన వాళ్లు వైఎస్ వారుసులా..? పసుపు చీర కట్టుకుని వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు.. వైఎస్ వారసులా..?’అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు.
సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా.. మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా..? ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం?’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో వివేకా హత్య కేసు రోజు ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. మరి ఇది ఏ పార్టీకి ప్లస్ అవుతుందో తెలియాలంటే జూన్ 4వరకు ఆగాల్సిందే.