తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం(Tirumala Prasadam) తయారీలో పశువుల కొవ్వులు కలిపారని, ఇదంతా వైసీపీకి తెలిసే జరిగిందంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పవిత్రతను భ్రష్టు పట్టించారంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం, నిత్యాన్న ప్రసాదం వరకు అన్నింటినీ సర్వనాశం చేశారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి వీటిని తయారు చేయాల్సింది ఉన్నా.. ఇందులో కూడా కల్తీకి తెరలేపింది వైసీపీ ప్రభుత్వం. శ్రీవారి ప్రసాదాల్లో జంతువుల కొవ్వును కలిపారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీనికి కారకులు ఎవరైనా విడిచి పెట్టే ప్రసక్తే లేదు. ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకుని.. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను పరమ పవిత్రంగా స్వీకరిస్తారు. అటువంటి ప్రసాదాన్ని కల్తీ చేయడమే కాకుండా అందులో.. పశువుల కొవ్వులు, ఫిష్ ఆయిల్స్‌ను కలపడం అనేది క్షమించరాని నేరం. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని చంద్రబాబు చెప్పారు.
‘‘స్వచ్ఛమైన నెయ్యి తీసుకొచ్చి ప్రక్షాళన చేయాల్సిందిగా ఆదేశాలిచ్చాం. శ్రీవారి ప్రసాద(Tirumala Prasadam) నాణ్యత పెరిగింది. ఈ నాణ్యతను ఇంకా పెంచేలా చర్యలు తీసుకుంటాం. 8 జూలై 2024 ప్రసాదం శాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపించాం. జులై 17న ఎన్‌డీడీబీ సీఏఎల్ఎఫ్ ల్యాబ్‌లో పరీక్షలు చేయిస్తే విస్తుబోయే నిజాలు తెలిశాయి. ల్యాబ్ నివేదిక ప్రకారం.. శ్రీవారి ప్రసాదం కోసం వినియోగిస్తున్న ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, పత్తి గింజలు, మొక్కజొన్నతో పాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్ నివేదికతో వైసీపీ ప్రభుత్వం పాల్పడిన ఈ ఘోరం బట్టబయలైంది’’ అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆధారాలతో సహా వెల్లడించారు. కాగా టీడీపీ వ్యాఖ్యలను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని అన్నారు.