మదనపల్లి(Madanapalle) సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే సమయంలో ఇది ఘటనగా తాము భావించడం లేదని, ఎవరో కావాలనే ఈ మంటను పెట్టారని డీజీపీ అనుమానం వ్యక్తం చేయడంతో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ క్రమంలోనే అసలు ఈ ఘటనలో ఏ దస్త్రాలు దగ్దమయ్యాయన్న వివరాలు ఇవ్వాలని కూడా అధికారులను కోరింది సర్కార్. ఈ క్రమంలోనే ఈ కేసు దర్యాప్తులో సీఐడీ స్పీడ్ పెంచింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, మదనపల్లి(Madanapalle)లో ఏకకాలంలో తనిఖీలు చేశారు సీఐడీ అధికారులు. హైదరాబాదులో పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్ దగ్గర నాలుగు బాక్సుల ఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తంబల్లపల్లిలో ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఇంట్లో తనిఖీలు చేశారు. మదనపల్లిలో పెద్దిరెడ్డి అనుచరులను పిలిచి విచారించింది సీఐడీ బృందం. అతి త్వరలోనే ఈ కేసులో కీలక పురోగతి లభిస్తుందని సీఐడీ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి.