AP Rythu Bazars | ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మరో మాటను కూటమి ప్రభుత్వం నెరవేర్చుకుంది. ఇచ్చిన మాట ప్రచారం ప్రతి ఒక్కరికీ సరసమైన ధరలకే నాణ్యమైన నిత్యావసరాలను అందించడం ప్రారంభించింది సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లు, రీటైల్ మార్కెట్లలో ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఈ కౌంటర్ల ద్వారా అతి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాం, కందిపప్పు వంటి నిత్యావసరాలు అందించడం ప్రారంభించినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాల శాఖ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలోని రైతు బజార్లు సహా ఉషోదయ, మెట్రో, రిలయన్స్, డీమార్ట్ వంటి రీటైల్ దుకాణాల్లో నాణ్యమైన నిత్యావసర సరుకులను తక్కువ ధరలకే అందించడం మొదలు పెట్టామని జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ప్రకటించారు.
ఇప్పటి వరకు ఏడు రైతు బజార్లు, 27 రీటైల్ షాపులు, 96 బియ్యం దుకాణాలు, 48 పప్పుధాన్యాల షాపులలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన బియ్యం, కందిపప్పు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ కౌంటర్ల ద్వారా బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.181 ఉన్న కందిపప్పును రూ.160కు, కిలో రూ.55.85 ఉన్న సోనా మసూరి స్టీమ్ బియ్యాన్ని రూ.49కి, రూ.52.40 ఉన్న సోనామసూరి పచచి బియ్యాన్ని రూ.48 లకు తగ్గించి అమ్మడానికి చర్యలు తీసుకున్నామని వివరించారు అధికారులు.
AP Rythu Bazars | ఈ కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటి నుంచి పలు దుకాణాల్లో 5,335 మంది వినియోగదారులు 227.74 క్వింటాళ్ల బియ్యం, 6,923 మంది వినియోగదారులు 83.02 క్వింటాళ్ల కందిపప్పు కొనుగోలు చేశారని వెల్లడించారు అధికారులు. వీటితో పాటుగా అన్ని కౌంటర్ల దగ్గర సరుకుల నాణ్యతను టెక్నికల్ సిబ్బంది, తూకాన్ని లీగల్ మెట్రాలజీ సిబ్బంది తనిఖీ చేస్తున్నారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ కోరింది.