వరద సహాయక చర్యలు తమ వీధిలో అందలేదని ప్రశ్నించినందుకు బాధితులపై వీఆర్ఓ జయలక్ష్మీ చేయి చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా సదరు బాధితులకు దుర్భాషలాడారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ సృష్టించింది. ఇదీ కూటమి సర్కార్‌లో వరద బాధితుల పరిస్థితి అంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఈ అంశంపై కూటమి ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. సదరు వీఆర్వోపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే ఆ విఆర్వోను విధుల నుంచి తొలగించామని కృష్ణా జిల్లా కలెక్టర్ సృజన వెల్లడించారు. అంతేకాకుండా ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా అందించామని తెలిపారు. వరద బాధితులతో సంయమనంగా వ్యవహరించాలని, ఇటువంటి దురుసు ప్రవర్తన పనికిరాదని, ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు సూచించారు.
వరదల కారణంగా బాధలో ఉన్న బాధితులు ఒక మాట అన్నా ఓపికగా సమాధానం చెప్పాలని సీఎం గతంలో కూడా వివరించారు. కానీ కొందరు అధికారులు మాత్రం ఇంకా తలబిరుసు ప్రవర్తనే కనబరుస్తున్నారు. దీంతో అలాంటి అధికారుల విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుందని చెప్పేలా ఈ వీఆర్వో వ్యవహారంలో చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. తన చర్యలపై సదరు వీఆర్వో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.