అచ్యుతాపురం(Atchutapuram) ఫార్మా సెచ్ పేలుడు ఘటన క్షతగాత్రులను ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు పరామర్శించారు. అనకాపల్లిలోని మెడికోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన కలిసి వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి ధైర్యం చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం వెనకాడదని బాధితుల కుటుంబీకులకు భీరోసా ఇచ్చారు. అదే విధంగా వారికి ఆర్థిక సహాయం చేస్తామని, తీవ్రగాయాలైన వారికి రూ.50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల పరిహారం అందిస్తామని స్వయంగా సీఎం చంద్రబాబే(Chandrababu) ప్రకటించారు.
క్షతగాత్రుల ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారు పూర్తిగా కోలుకునేలా చేయాలని, అందుకు ఎంత మెరుగైన వైద్యమైనా అందించాలని, అందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం బరాయిస్తుందని వివరించారు. అనంతరం చంద్రబాబు.. ఘటనా స్థలానికి(Atchutapuram Pharma SEZ) బయలుదేరారు. అక్కడ జరుగుతున్న దర్యాప్తు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరగడానికి అసలు కారణంపై ఆయన అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాధ్యులను వదిలి పెట్టొద్దని, ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక అందించాలని కోరినట్లు సమాచారం.