Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని, అలాగే డీఎస్పీతో సహా ముగ్గురు సీనియర్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం తిరుమలలో తొక్కిసలాట ఘటన బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆరుగురు భక్తుల మృతి, పదుల సంఖ్యలో గాయపడటానికి కారకులైన ఒక డీఎస్పీ సహా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం(Chandrababu)… మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. గతంలో తిరుమలలో టోకెన్లు ఇచ్చే విధానం కాకుండా.. తిరుపతిలో టోకెన్లు ఇచ్చే కొత్త విధానాన్ని గత వైసీపీ పాలనలో ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. దీంతో ఏర్పాట్లలో లోపాలు జరిగాయని, అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకమీదట ఇలా జరగకుండా తగిన చర్యలు తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
తిరుపతిలోని ఎంజీఎం పాఠశాల సమీపంలోని బైరాగి పట్టెడ వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట(Tirumala Stampede)లో ఆరుగురు భక్తులు మరణించగా, దాదాపు 40 మంది గాయపడ్డారు. జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనానికి దేశవ్యాప్తంగా వందలాది మంది భక్తులు తరలివచ్చారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జనం ఒక్కసారిగా ఎగబడడంతో ఈ తొక్కిసలాట జరిగింది.