Madanapalle Fire Accident | మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెవెన్యూ శాఖకు చెందిన కీలక ఫైళ్లు, కంప్యూటర్లు దగ్దమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు.. అసలు ఇది జరిగిన ప్రమాదమా.. చేసిన కుట్ర అని అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే మదనపల్లెకు వెళ్లి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. అందుకోసం హెలికాప్టర్‌లో వెళ్లాలని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ, సీఐడీ చీఫ్ ఇద్దరూ కలిసి హెలికాప్టర్‌లో మదనపల్లెకు బయలుదెరారు. అయితే నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించడానికి గంటల ముందు ఈ ప్రమాదం జరగడం, అందులో కీలక దస్త్రాలు తగలబడటంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి 12 గంటలకు గౌతమ్ అనే ఉద్యోగి కార్యాలయంలో ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అసలు ఆ ఉద్యోగి ఆ సమయంలో కార్యాలయంలో ఎందుకు ఉన్నాడు? ఏం పనిపై వచ్చాడు? అన్న అనుమానాలకు చంద్రబాబు కూడా వ్యక్తం చేశారు.
మదనపల్లె అగ్నిప్రమాద ఘటనపై(Madanapalle Fire Accident) అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో సీఎం చంద్రబాబు(Chandrababu).. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో సీఎం నీరభ్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా కూడా పాల్గొన్నారు. ఈ ఘటనకు చెందిన పూర్తి వివరాలతో వీలైనంత త్వరగా నివేదిక అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే అగ్నిప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్ని ప్రమాద సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే చాలా వరకు ఫైళ్లు దగ్దమైనట్లు వారు చెప్తున్నారు. కాగా అసలు దగ్ధమైన ఫైళ్లు దేనికి సంబంధించినది, వాటిలో ఎటువంటి సమాచారం ఉంది వంటి వివరాలు తనకు తెలపాలని సీఎం కోరారు.