అన్న క్యాంటీన్లను(Anna Canteens) కూటమి సర్కార్ నేటి నుంచి పునఃప్రారంభించనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు చెప్పారు. అన్న క్యాంటీన్ల ద్వారా ప్రతి రోజూ 1.05 లక్షల మందికి భోజనం అందించనున్నారు. ఉదయం అల్పాహరం సమయంలో 35వేల మందికి, మధ్యాహ్నం భోజనం 35 వేల మందికి, రాత్రి భోజనం 35 వేల మందికి ఆహారం సరఫరా చేయనున్నారు. రూ.5 భోజనం ద్వారా ఎంతో మందికి మేలు చేకూరుతుందని సర్కార్ చెప్తుంది. ఈరోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గుడివాడ(Gudivada)లో మొదటి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఈ తొలి విడత పునఃప్రారంభంలో భాగంగా 100 క్యాంటీన్లను మళ్ళీ అందుబాటులోకి తీసుకురానున్నారు.
అన్న క్యాంటీన్లలో(Anna Canteens) సోమవారం ఉదయం నుంచి శనివారం రాత్రి ప్రతిరోజు ఉదయం అల్పాహారం నుంచి రాత్రి అన్నం వరకు అందించనున్నారు. వారంలో ఒకరోజు ప్రత్యేక ఆహారం అందిస్తారు. ఆదివారం రోజున క్యాంటీన్‌కు సెలవు ఉంటుంది. అంతేకాకుండా ఉదయం 7:30 గంటల నుంచి 10 గంటల వరకు అల్పాహారం, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 3 గంటల వరకు, రాత్రి 7:30 గంటల నుంచి 9 గంటల వరకు భోజనం అందుబాటులో ఉంటుంది.
ఇక అల్పాహారం విషయానికి వస్తే ఇడ్లీ/పూరి 3, ఉప్మా/పొంగల్ 250 గ్రాములు ఇస్తారు. భోజనంలో అన్నం 400 గ్రాములు, చట్నీ/పొడి 15 గ్రాములు, పప్పు 120 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, మిక్చర్ 25 గ్రాములు, కూర 100 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు, పెరుగు 75 గ్రాములు అందిస్తారు.