ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేసినా తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీరదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా ఇంకా తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. ఈ సమస్యను తమ ప్రభుత్వం గుర్తించిందని, దానిని కూడా అధిగమించే దిశగా చర్యలు చేపడుతోందని వివరించారు. మాసబ్‌ట్యాంక్ వేదికగా బీఎఫ్ఎస్ఐ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా 3 లక్షల మంది విద్యార్థులు పట్టాలు పుచ్చుకుని బయటకు వస్తున్నారని, దాంతో రెండు లక్షల ఉద్యోగాలు కల్పించినా.. మరో లక్ష మంది విద్యార్థులు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని తెలిపారు.
దానిని అధిగమించేలా యువతలో నైపుణ్యాలు పెంచడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించి తద్వారా వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. నిరుద్యోగ భూతాన్ని తరిమేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నిరుద్యోగ సమస్యను తీర్చడం కోసమే అన్ని శాఖల్లో కూడా ఉన్న ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు చేపట్టామని ఆయన(Revanth Reddy) చెప్పారు. నిరుద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.