ఏపీ ఎన్నికల ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) చుట్టూ తిరుగుతోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములను లాక్కొంటారని టీడీపీ కూటమి నేతలు ఆరోపిస్తుంటే.. ప్రజలను భయపెడుతున్నారని అలాందేమీ లేదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ చట్టం మంచిదంటూ గతంలో ఈటీవీ, టీడీపీ నేతలు మెచ్చుకున్నారంటూ వైసీపీ పోస్టులు పెడుతుంది. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై జగన్ చేసిన కుట్ర ఇదేనంటూ టీడీపీ తాజాగా ఓ పోస్టు చేసింది.
“21 సెప్టెంబర్ 2022న విడుదల చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) గెజిట్ లో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా “Any officer” అని ఉంది. అంటే ఓ ప్రభుత్వ అధికారి భూమి విషయంలో టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిగా వ్యవహరించనున్నారు. కానీ 17 అక్టోబర్ 2023న ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గెజిట్ నోటిఫికేషన్ లో గతంలో ఇచ్చిన “Any officer” అనే విషయాన్ని “Any Person” గా మార్చారు. అంటే గత నోటిఫికేషన్ ప్రకారం ఓ ప్రభుత్వ అధికారి టీఆర్వో(TRO) గా వ్యవహరిస్తే, కొత్త గెజిట్ ప్రకారం ఏ వ్యక్తి అయినా టీఆర్వోగా పనిచేయవచ్చు. అంటే, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (TRO)గా వైసీపీ నేతలని పెట్టి, మన భూములు, ఇళ్లు లాగేసుకునేందుకు భయంకరమైన కుట్ర పన్నారు” అంటూ టీడీపీ ఆరోపించింది. మొత్తానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది.