నెల్లూరు(Nellore) నగర వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav), ఆయన సొంత బాబాయి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్(Roop Kumar Yadav)ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి పరిస్థితి చేరింది. ఈ క్రమంలోనే రూప్ ముఖ్య అనుచరుడు ముస్లిం మైనార్టీ నేత అబ్దుల్ హాజీపై హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హాజీని రూప్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడిన మైనార్టీ నేత హాజీపై హత్యాయత్నం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తనపై కక్షతో పార్టీ నేతలు, కార్పొరేటర్ల ఇళ్లు, ఆఫీసులపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా ముందుకొచ్చి తాను నీతిమంతుడిని అని చెప్పుకోవడం కాదు.. అనిల్.. నీ మనుషులు ఏం చేస్తున్నారో చూసుకో అని సూచించారు. రెక్కల కష్టంతో రాత్రింబవళ్లు శత్రువులతో పోరాడి అందలం ఎక్కిస్తే తమపైనే దాడులు చేయిస్తావా?అని ప్రశ్నించారు. ఈ దాడులకు తాము తిరిగి సమాధానం చెబితే తట్టుకోలేవు అంటూ గట్టిగా హెచ్చరించారు. నెల్లూరు(Nellore) నగరంలో పార్టీని అనిల్ సర్వనాశనం చేస్తున్నారని.. ఇన్ని పరిణామాలు జరుగుతున్నా అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు రూప్.
Read Also: ఏపీ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి
Follow us on: Google News, Koo, Twitter