అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ బీజేపీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. పార్టీ నూతన కార్యవర్గాన్ని(BJP New Panel) ఏర్పాటు చేసింది. మొత్తం 30 మందితో కూడిన కొత్త కార్యవర్గాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి(Purandeswari) ప్రకటించారు. నూతన కార్యవర్గంలో నలుగురు ప్రధాన కార్యదర్శులు, 10 మంది కార్యదర్శులు, 11 మంది ఉపాధ్యక్షులు, 7 మోర్చాలకు కొత్త అధ్యక్షులు, ఏడుగురు అధికార ప్రతినిధులతో పాటు మీడియా, సోషల్ మీడియా విభాగాలకు కొత్త ఇన్‌ఛార్జిలను నియమించారు.
గుంటూరుకు చెందిన బిట్ర శివన్నారాయణ, చందు సాంబశివరావు, సాదినేని యామినిలకు నూతన కార్యవర్గంలో అవకాశం కల్పించారు పురంధరేశ్వరి. ఈ ముగ్గురు టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారే. కడప జిల్లా నుంచి బాలకృష్ణ యాదవ్, ఆదినారాయణరెడ్డి, ఏలూరు జిల్లాకు చెందిన గారపాటి తపన చౌదరి, నిర్మలా కిషోర్, హిందూపురం నుంచి దేవానంద్, విజయవాడ నుంచి పాతూరి నాగభూషణం, ఒంగోలుకు చెందిన లంకా దినకర్‌లకు నూతన కార్యవర్గంలో పదవులు దక్కాయి. వీరు కూడా గతంలో టీడీపీలో పనిచేసినవారే. ఇక గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు కూడా నూతన కార్యవర్గంలోకి తీసుకున్నారు. కాంగ్రెస్, టీడీపీల్లో పనిచేసి బీజేపీలో చేరిన వాకాటి నారాయణకు పార్టీ కార్యవర్గంలో చోటు కల్పించారు.
కొత్త కార్యవర్గంలో(BJP New Panel) వలస నేతలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు పురంధరేశ్వరి. దాదాపు 50 శాతం మంది వలస నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో.. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అన్యాయం జరిగిందని కొందరు సీనియర్లు తమ సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకే పదవుల పంపకాలు చేశారని ఆరోపిస్తున్నారు.