ఏపీ నూతన డీజీపీ(New AP DGP)గా హరీష్ కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. కొత్త డీజీపీ ఎంపిక కోసం ముగ్గురి పేర్లు పంపించాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముగ్గురి పేర్లతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపించింది.
ఇందులో ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) పేర్లను సిఫార్సు చేసింది. అయితే ఈ ముగ్గురిలో హరీష్ కుమార్ గుప్తాను కొత్త డీజీపీ(New AP DGP)గా నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 1992వ బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు.
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల్లో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఈసీ.. రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ఎన్నికల విధులు ఆయనకు అప్పగించొద్దని స్పష్టం చేసింది.