ఎన్నికల వేళ జనసేన(Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. జనసేన పార్టీకి కామన్ సింబల్‌గా గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాల్లో గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌గా ఇతరులకు కేటాయించవచ్చని సూచించారు.
కొంతకాలంగా గాజు గ్లాస్ గుర్తు ఎన్నికల సంఘం వద్ద ఫ్రీ సింబల్‌గా ఉండేది. దీంతో ఈ గుర్తును తమకు కేటాయించాలని జనసేన(Janasena) పార్టీ ఈసీని అభ్యర్థించింది. అయితే ఇదే గుర్తు కోసం రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా డిమాండ్ చేశారు. కానీ జనసేన పార్టీకే గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయంపై జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.