డిసెంబర్ 17 నుంచి 23 వరకు జరగనున్న ఏకలవ్య మోడల్ స్కూల్స్ 3వ జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. 15 వ్యక్తిగత విభాగాలు, 7 టీమ్ కేటగిరీల్లో ఈ పోటీలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 5,970 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టు కోసం 487 మంది క్రీడాకారులను ఎంపిక చేసి, తర్ఫీదును ఇస్తున్నారు. అండర్-14, అండర్-19 కేటగిరీల్లో పోటీలు జరుగుతాయని వివరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం, లయోలా కాలేజీ, గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, బీఆర్ స్టేడియంలో పోటీలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. జాతీయ స్థాయిలో ఆడే ఏకలవ్య క్రీడాకారులకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శిక్షణ అందజేస్తాయి. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయిలో పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులే, డిసెంబరులో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.