ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఇక సర్వీస్ ఓటర్ల సంఖ్య 65,707గా ఉంది అని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఓటర్ల సంఖ్య 1,500 దాటితో ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని వివరించారు. ఏపీలో ఓటర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని 224 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు.
అలాగే రాష్ట్రం(Andhra Pradesh)లో 64 శాతం పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ పరిధిలోకి తీసుకువస్తామని తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల పరిశీలకులు కొన్ని నియోజవకర్గాలను సమస్యాత్మకంగా గుర్తించారన్నారు. వారి సిఫారసుల మేరకు పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు… ప్రకాశం జిల్లాలో ఒంగోలు… నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ… తిరుపతి జిల్లాలో తిరుపతి, చంద్రగిరి… ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సెంట్రల్… చిత్తూరు జిల్లాలో పుంగనూరు, పలమనేరు… అన్నమయ్య జిల్లాలో పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో వెబ్ కాస్టింగ్ అమలు చేస్తామని మీనా పేర్కొన్నారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలను మోహరిస్తామని వెల్లడించారు.